Friday, January 29, 2016

నమ్మదగిన దేవుడు

ఎజ్రా గ్రంధ ధ్యానం
దేవుని ప్రజల పునరుద్ధరణ, వారి ఆత్మీయ జీవితాల ఉజ్జీవం, దేవుని ఆలయ పునర్నిర్మాణం మరియు ఆరాధన పునరుజ్జీవమును గురించి ఎజ్రా గ్రంధం  తెలియజేస్తుంది. ఒక్క మాటలో, ఇది దేవుని నమ్మదగిన వాగ్దాన నెరవేర్పును గురించి తెలియజేసే గాధ.

చారిత్రక నేపధ్యం
యూదా దేవునిని విస్మరించడమే కాక, నాటి శక్తివంతమైన బబులోను సామ్రాజ్యానికి క్రీ.పూ.6వ శతాబ్ది ఆరంభములో తిరుగుబాటు చేసింది. దాని ఫలితంగా, దేశ నాయకులు, యాజకులు, ప్రవక్తలు, ఇతర ప్రముఖులు మరియు ప్రజలు నెబుకద్నేజరు చేత చెరలోనికి కొనిపోబడ్డారు. యూదా నాశనమైపోయింది, యెరూషలేము ప్రాకారాలు తగులబెట్టబడినాయి, మరియు దేవాలయం సమూల నాశనం చేయబడింది. క్రీ.పూ. 539లో పారసీక రాజైన రెండవ కోరేషు బబులోనును ఓడించి సామ్రాజ్యాన్ని ఏలనారంభించినప్పుడు దేవుడు తన వాగ్దాన నేరవేర్పును ప్రారంభిస్తాడు.
ఈ గ్రంధం నుండి మనం నేర్చుకోగలిగిన కొన్ని సత్యములు

1. దేవుడు చేసిన వాగ్దాలను ఆయన నెరవేరుస్తాడు:
  • ఈ గ్రంధముయొక్క ముఖ్య ఉద్దేశం, దేవుని వాగ్దాన నెరవేర్పు మరియు తన ప్రజలపట్ల ఆయన చూపించిన విశ్వాసనీయత గురించి మనకు తెలియజేయడం. తన ప్రజలను తిరిగి వారి దేశమునకు తీసుకు వెళ్తానని యూదుల 70 యేండ్ల చెరకాలంలో యిర్మియా ద్వారా దేవుడు చేసిన వాగ్దానం మనకు జ్ఞాపకం చేయబడుతుంది (ఎజ్రా 1:1 cf. యిర్మియా 29:10-14).
  • దేవుని వాగ్దాన నెరవేర్పు కొరకు రాజైన కోరేషును దేవుడు నియమించాడు (ఎజ్రా 1:2).
  • వెళ్ళుటకు మనుష్యులను మరియు ఇచ్చుటకు దాతలను దేవుడు ప్రేరేపించాడు (ఎజ్రా 1:5-6).
  • దేవుని వాగ్దానాలు మన జీవితంలో ఎంత నమ్మదగినవి అంటే, ఒక భక్తుడు చెప్పినట్లు, “దేవుని వాగ్దానాలపై మనం ఆనుకున్నంత మాత్రాన అవి విఫలం కావు.”
  • చివరికి, మొదటి తరలింపులో భాగంగా కొందరు ప్రజలు తమ స్వదేశానికి తిరిగి వచ్చి యెరూషలేములోను, దాని సమీప గ్రామాలలోను నివసించుట ప్రారంభిస్తారు (ఎజ్రా 1:70).

2. విజయం మనలను స్తుతిలోనికి నడిపించాలి
  • వారు తిరిగి వచ్చిన వెంటనే, మొదటిగా చేసిన పని, పడగొట్టబడిన బలిపీఠం ఉన్న స్థలం కనుగొని, అచ్చటనే మరొకటి కట్టి దేవునిని ఆరాధించారు (ఎజ్రా 2:1-2).
  • కొన్ని సార్లు  బలిపీఠం కట్టుట సుళువైన పని కాదు. వారు తమ పొరుగువారికి భయపడుచునే కట్టినట్లు వ్రాయబడింది (ఎజ్రా 2:3).
  • తరువాత, దేవాలయపు పునాదులు వేయబడ్డాయి. “ఆయన కృప నిరంతరము నిలుచును” అని పాడుచు ప్రజలు దేవుని స్తుతించుట ప్రారంభించారు (ఎజ్రా 3:11). 
  • కొందరు గొప్ప శబ్ధముతో ఏడ్చిరి, మరికొందరు సంతోషముతో అరచిరి అను మాటలు మనకు అచ్చటి ఉద్వేగము మరియు దాని ఫలితంగా వచ్చిన ఆధ్యాత్మిక ఉప్పెనను మనకు చూపిస్తున్నాయి (ఎజ్రా 3:13).

3. విజయమున్న చోటనే శత్రువుంటాడు
  • విజయం సాధించాం మనకిక సమస్యలుండవు అని మనం అనుకోకూడదు. శత్రువు మన వెంటనే ఉంటాడు (ఎజ్రా 4:1).
  • వాడు ఉపయోగించే తంత్రాలు: ఇబ్బంది కలుగజేయుట, బాధపరచుట, భంగపరచుట, తప్పుమోపుట (ఎజ్రా 4:4-6).
  • ఇశ్రాయేలీయులు తిరుగుబాటుదారులని, వారి కట్టడమును ఆపించమని కోరేషు తరువాతి రాజైన అర్తహషస్తకు శత్రువులు లేఖ రాసారు (ఎజ్రా 4:15).
  • దేవుని ఆలయమును కట్టు పనిని శత్రువులు కొంతకాలం ఆపగలిగారు కానీ, ఇశ్రాయేలీయులు దానిని విశ్వాసంతో కొనసాగించారు. హగ్గయి మరియు జకర్యా దేవుని ప్రవచన వాక్కులను వెదజల్లుచుండగా, యెరుబ్బాబెలు మరియు యెషూవా పనిని కొనసాగించారు (ఎజ్రా 5:1-2). 

4. శత్రువున్న చోటనే దేవుడుంటాడు
  • దేవుడు తన ప్రజలపై తన దృష్టినుంచి వారికి అప్పగించిన పని కొనసాగునట్లు సహాయపడతాడు (ఎజ్రా 5:5).
  • ఇప్పుడు, అర్తహషస్త తరువాత దర్యావేషు పరిపాలిస్తున్న కాలంలో మరలా ఆ పనిని ఆపించమని శత్రువులు లేఖ వ్రాస్తారు. కానీ, దర్యావేషు దేశ దస్తావేజులను పరిశీలించి, దేవాలయ పునర్నిర్మాణం గురించిన రాజైన కోరేషు యొక్క ఆజ్ఞ గురించి తెలుసుకొని, ఆలయ నిర్మాణం జరగాలని, దానిని అడ్డుకున్నవారికి శిక్ష తప్పదని ఒక తిరుగులేని ఆజ్ఞను జారీచేస్తాడు (ఎజ్రా 6:3-13). 
  • దేవుడు తమకిచ్చిన పనిని వారు పూర్తి చేయుటకు ఆయన వారికి సహాయపడుట ద్వారా చివరికి వారు ఆ పనిని ముగించగలుగుతారు (ఎజ్రా 6:14).
  • వారు తమ్మును తాము ప్రత్యేక పరచుకొని, దేవునిని ఆరాధించి ఆయనను వెదికినట్లు బైబిలు మనకు చూపిస్తుంది (ఎజ్రా 6:21).
  • విజయం తరువాత కూడా వారు సమస్త ఘనత దేవునికే ఆరోపిస్తారు (ఎజ్రా 7:27), ఎందుకంటే, దేవుని వాగ్దానాల నెరవేర్పు వలన మనకు కలిగిన మేలు, విజయం మన గొప్ప తనము, భక్తి వలన కలిగినవి కావు. అవి కేవలం దేవుని విశ్వాసనీయతను సూచిస్తాయి.

ముగింపు
  • తరువాత, ఎజ్రా నాయకత్వంలో మరికొంతమంది యూదులు తమ స్వదేశానికి తిరిగివస్తారు.
  • ఎజ్రా గ్రంధం కేవలం ఒక సామాజిక-రాజకీయ పునరుద్ధరణ గురించి తెలియజేసే పుస్తకం మాత్రమే కాదు గాని, పశ్చాత్తాపం, మారుమనస్సు మరియు ఆధ్యాత్మిక ఉజ్జీవం ఎలా సంభవించాయో నేర్పించే గ్రంధం.
  • ఇశ్రాయేలీయులు అన్యదేవతలను ఆరాధించడానికి ప్రేరేపించబడకుండా ఉండుటకు దేవుడు వారిని అన్య స్త్రీలను వివాహమాడకుండా వారించాడు. కానీ చెర కాలంలో అనేకులు దేవుని ఆజ్ఞను మీరి అన్య స్త్రీలను వివాహం చేసుకున్నారు. ఈ సమయంలో, గొప్ప పశ్చాత్తాపం పొందుకొని వారు అన్యస్త్రీలను పరిత్యజించారు (10వ అధ్యా).
  • నేడు మనం అలా చేయాలని యేసు బోధించలేదు కానీ, దేవునికి అయిష్టమైనది ఏదైనా మన జీవితంలో ఉంటే, దానిని మనం విడిచిపెట్టవలసిందే.

అన్వయం
  • దేవుని వాగ్దాన నెరవేర్పు మన కొరకు మాత్రమే కాదు గాని అది ఆయన నామ మహిమార్ధం అని మనం గుర్తించాలి. దేవుడు తన వాగ్దానాలను మన జీవితాలలో నెరవేరుచున్నప్పుడు మేలు పొంది మరచుట తగదు గాని మనలో ఉజ్జీవం రావాలి. 
  • ఇశ్రాయేలీయులులో వచ్చిన ఉజ్జీవం మనలో రావాలంటే, అది నీతోనే ప్రారంభం కావాలి.
  • ఉపమానం: జిప్సీ స్మిత్ అనే ఒక ఉజ్జీవ ప్రసంగికుడిని ఒక వ్యక్తి ఉజ్జీవం ఎలా వస్తుందని అడిగాడు. దానికి స్మిత్ సమాధానంగా, “సహోదరుడా, నీవు ఇంటికి వెళ్ళు. ఒంటరిగా ఒక గదిలోనికి వెళ్లి గడియపెట్టుకో. ఒక సుద్దముక్క తీసుకోని రెండు చిన్న వృత్తాకారాలు నేలపై గీయి. నీ రెండు మోకాళ్లను వాటిలో పెట్టి, ఈ వృత్తాకారాలలో ఉజ్జీవం రప్పించమని ప్రభువును వేడుకో. ఈ ప్రార్ధనకు జవాబు వస్తే, ఉజ్జీవం ప్రారంభమైనట్లే.” అని చెప్పాడు. —C. A. Curry, in Western Recorder.
  • వేల్సు దేశంలో ఉజ్జీవ జ్వాలలు రగులుతున్న దినాల్లో లండన్ నుంచి ఒక వ్యక్తి ఆ ఉజ్జీవంలో పాల్గొనాలనే ఆశతో వేల్సులోని ఒక గ్రామానికి రైలులో వెళ్లి, “ఇక్కడ ఉజ్జీవం ఎక్కడ జరుగుతుంద”ని ఒక కూడలి వద్ద ఉన్న పోలీసును అడిగాడు. దానికి సమాధానంగా ఆ వ్యక్తి నిటారుగా నిలబడి తన గుండె మీద చరుచుకొని, “వేల్సు ఉజ్జీవమా సార్? ఇదుగో ఈ గుండీల క్రింద ఉంది” అని చెప్పాడు. -Sunday School Times
  • దేవుడు తన వాగ్దానాలు నెరవేర్చడానికి సిద్ధంగా ఉన్నాడు. నీవు ఆయన చిత్తానుసారంగా నడుచుకోవడానికి సిద్ధంగా ఉన్నవా?
  • దేవుడు నీ పట్ల చేసిన కార్యాలు కేవలం భౌతికంగానే ఉంటున్నాయా లేదా, అవి నీలో ఆధ్యాత్మిక మేల్కొల్పు కలిగించేవిగా ఉంటున్నాయా?